Daily Archives: October 26, 2008

మధ్య తరగతి బ్రతుకు

మధ్యతరగతి బ్రతుకు
మింగలేదు మెతుకు
మీసాలకు సంపెంగ నూనె అతుకు
పొరుగువాని లొసుగు వెతుకు
మిథ్యా ప్రతిష్టలో చితుకు
మా తాతలు త్రాగారు నేతులు
వాసన చూడండి మా మూతులు
మాకు మేమే తవ్వుకుంటాం
సాంప్రదాయపు గోతులు
ఎవ్వరూ చెప్పనక్కరలేదు మాకు నీతులు
పై కెగురలేక క్రిందకు జారలేక
వ్రేలాడుతాం త్రిశంఖు స్వర్గంలో
ఎందుకు——–?
బూజుపట్టిన భావాల పొరలు తొలగించ లేక
కుల సాంప్రదాయపు సంకెళ్ళు త్రెంచలేక
వంశాచారపధ్దతుల పాకుడు రాళ్ళపై నిలువలేక
నేటి ఆర్ధిక పరిస్థితుల ఏటికెదురీదలేక
పయనిస్థాం లక్ష్యం లేని గమ్యానికి తప్పటడుగులు వేస్తూ
పడుతూ——-లేస్తూ

సామీప్యం

కఠిన శిలలనైన
కరకు గుండెలనైన
కరిగించగల శక్తి
సంగీతానికుంటే
మండుటెండనైన
మంచులా తలపించు
కారు చీకటినైన
వెన్నెల వలె మలపించు
శక్తిగలదొక్కటే
పసిపాప చిరునవ్వు.

ఓ మనిషీ యిదా నీ పంథా?

నీతి నియమాలకై సరిహద్దులేర్పరిచి
న్యాయ ధర్మాలకై కొలబద్ద్లుంచి
జాతి మతములటంచు విభజనలు గావించి
వీటన్నిటికి వేరు దైవాల నియమించి
మానవత్త్వపు మాట మరచావు నీవు
ఓ మనిషీ యిదా నీపంథా?

సత్యాహింసలు నీ మతమనుచు
ధర్మ మార్గమే నీ బాట యనుచు
ప్రజా క్షేమమే నీ లక్ష్యమనుచు
శాంతి పరిరక్షణే నీ గమ్యమనుచు
మారణాయుధములు చేతబూనావు
ఓ మనిషీ యిదా నీ పంథా?

రాజకీయములు నీ సర్వస్వమనుచు
పదవీ వ్యామోహమే పరమార్ధముగ నెంచి
రక్త సంబంధముల రచ్చకీడ్పించావు
రుధిరధారల యెల్లెడల చిందింపజేశావు
పరంధాముడిని కూడా పార్టీలో చేర్చావు
ఓ మనిషీ యిదా నీ పంథా?

స్త్రీలు తల్లి తోబుట్టువులా భావించమనుచు
తరుణుల ప్రగతియే దేశ సౌభాగ్యమ్మనుచు
మగువను గౌరవించనిదే మనుగడ లేదనుచు
ఉపన్యాసములలో నమ్మ బలికేవు
వెండితెరపై స్త్రీల వలువలిప్పించావు
ఓ మనిషీ యిదా నీ పంథా?