జీవన సంఘర్షణ

కధ ప్రారంభించటానికి కాకులు దూరని కారడవి చీమలూ దూరని  చిట్టడవి అంటూ మొదలు పెట్ట నక్కర లేదు. అనగా అనగా ఒక చిన్న వూరు . ఆవూర్లో వంద గడపల సామాన్యులతో పాటు నాలుగైదు సంపన్నుల లోగిళ్ళు ఉన్నాయి.ఆ వూర్లొ ఒక అక్కా ఒక చెల్లి, అక్క బాల వితంతువు చెల్లి నడి వయసు వితంతువు.పిల్ల పీచూ బాదరాబందీ లేదు.ఉన్న చిన్న పొలం మీద ఫలసాయం సంవత్సరానికి  కొంత ధాన్యం వస్తాయి. చిన్నామె భర్త   వదిలి వెళ్ళిన  చిన్న ఇల్లు. వూరి వాళ్ళంతా చింత పడేవారు ఈ  యి ద్దరక్కచెల్లెళ్ళు ఎలా బ్రతుకు బండి  లాగించుతారని . భర్త పోయిన నాటినుంచి చెల్లెలు బయటికి వెళ్లేది కాదు.

బ్రతికినంత కాలం బ్రతుకు ని లాగుకునో  నెట్టు  కునో  నడపాల్సిందే!   చిన్నామెకు  దిష్టి మంత్రం ,తేలు మంత్రం  యిరుకు మంత్రం చప్పి మంత్రం  వచ్చు.పల్లెటూరు కావున ఎవరో ఒకరు వస్తారు.. యుక్తిగా తేలు మంత్రం వేయించు కునే టప్పుడు చిన్న పళ్ళెంలో బియ్యం పెసరపప్పు వేసి రూపాయ బిళ్ళ దానిపై ఉంచి తెమ్మనేవారు.మంత్రించిన తరువాత రూపాయి కొంత పప్పు బియ్యం ఉంచుకుని కొద్దిగా పప్పు బియ్యం మిగిల్చి ఒక కొసలొ కొద్దిగా పసుపు కుంకుమ వేసి, తెలు కుట్టిన చోట పసుపు కుంకుమ అద్ద మానేవారు. మిగతా వాటకి కూడా ఏవో తెమ్మనేవారు .

దిష్టి మంత్రానికి పిల్లల్నితేచ్చేటప్పుడు చిన్న గిన్నెలో అయిదు చెంచాల పంచదార తెమ్మనేవారు. అందులోంచి కొంత పంచదార అట్టే పెట్టుకుని మంత్రం వేసేక ఒక చెంచాడు పంచదారగిన్నెలో ఉంచి చిటికెడు పంచదార పిల్లల నోట్లో వేసే వారు.వీటితో వారి దినం తిరుతూందా అంటే తీరదు  కానీ వారి కాఫీ లోకి కొంత పంచదార సరిపోతుంది.ఎవరి పిల్లల్నయినా అతి ముద్దుగా ఆప్యాయంగా పలకరించేవారు.ఆవిధంగా పిల్లలు వారితో పాటు తల్లులు వచ్చేవారు.

ఇక పెద్దామె ఉదయాన్నే ఏడు గంటలవగానే ఒక చిన్నసత్తు గిన్నె కొంగు చాటున పట్టుకుని సంపన్నుల ఇంటికి  వెళ్లి ” ఏం చేస్తున్నారు అమ్మడూ ?”అంటు పలకరించేది .ఫ్రిజ్ లు లేని కాలం . కూరల బుట్ట వద్ద కెళ్లి చిందరవందరగా పడి ఉన్న కూరలన్నీ చక్కగా ఏరి ఎండిపోయిన వాటిని వేరు చేసి మంచి వాటిని సర్ది చుట్టూ శుభ్రం చేసి ,”అమ్మడూ !యీ నాలుగూ ఎండి పోయాయి తీసుకు వెళ్ళనా ? నువ్వైనా అవతల వేసేదే కదా ! ఏదో పెద్ద వాళ్ళం కురో పచ్చడో చేసుకుంటాం ,సరేనా అమ్మా!” అన్నాక కాదనడానికి ఇల్లాలికి నోరు రాదు .
అలాగే యింకో యింటికి వెళ్లి కాస్త పని సహాయం చేసి “అమ్మాయ్ కొద్దిగా పుల్ల మజ్జిగ వుంటే పోయ్యమ్మా. చెల్లికి వేడి  చేసింది .”ఉన్నంత లో గిన్నెలో పోసే వారు .తమ అవసరానికి మించి ఏ కాస్త కయినా ఆశ పడేవారు కాదు .

పెద్దింటి లోగిలిలో శాంతమ్మ కోడలు పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చారు.వుదయాన్నే ముసలామె వచ్చి కూరలు సర్ది కొన్ని అడిగి పట్టుకుపోవడం చూసి ఆశ్చర్యపోయింది.మర్నాడు ఆమె వచ్చే లోపున కూరలన్నీ సర్దేసి చుట్టూ శుభ్రం చేసేసింది.అది చూడగానే నిరుత్సాహం చెందింది. శాంతమ్మ వద్దకెళ్ళి “అమ్మడూ యీ రోజు కూరలన్నీ సర్దేసుకున్నావు,రోజూ అలవాటుగావస్తున్నాను కోపం వచ్చిందామ్మా?” “లేదు పిన్నిగారూ కోడలు వచ్చింది కదా తను సర్ది వుంటుంది.నేను చూసి కూరలేమైనా వుంటే యిస్తాను.”
ఫరవా లేదమ్మా వెళ్ళొస్తాను.”అంటూ వెళ్ళింది కావమ్మ అని పిలవబడే కామేశ్వరమ్మ.

మనసు కలతజెంది యింకో యింటికివెళ్ళాలన్న ధ్యాస కూడా మర్చిపోయి వుత్తి చేతుల్తో యిల్లు చేరింది.”యికపై మన బ్రతుకులు గడవడం కష్టమనిపిస్తోంది చిట్టీ.” “ఏమయింది అక్కా యిన్నాళ్ళూ లేని చింత యీ రోజెందుకు?”

జరిగిన సంగతి చెల్లికి వివరించిది.”మన ముందు తరం వాళ్ళకి అర్ధం చేసుకోవడం తక్కువ.పోనీలే వూరికే బాధ పడకు మన పెరట్లో కరివేపాకు నిమ్మచెట్టుకి కాయలు పచ్చి మిరప మొక్కకి కాయలున్నయి.కరివేపాకు పచ్చడి చేస్తాను.రేపటి సంగతి ఆలోచిద్దాం.”

అక్కకి ధైర్యం చెప్పింది గాని చిట్టెమ్మ గుండెల్లో ఒక మూల గుబులుగానే వుండెను.యిదే విధంగా అన్నిళ్ళవాళ్ళూ ఆలోచిస్తే తమ గతేమిటా అని,సరే అన్నింటికీ పరమాత్ముడే వున్నాడు.ఒక దారి మూసుకు పోతే నాలుగు దారులు కనిపిస్తాయి అనుకుంటూ అశావాదంతో లేచి పచ్చడి నూరడానికి బయలు దేరింది.

పచ్చడి అన్నం తింటున్న కావమ్మకి పచ్చడి కారానికి కడుపులో మంట తిరస్కారంతో గుండెల్లో మంట నాలుగు గ్లాసుల మంచి నీళ్ళు తాగింది.

మర్నాడు అలవాటుగా బయలుదేరింది,కాని మనసులోనే తర్కించుకుంటోంది రోజూ తను చేసే పని ఒక విధంగా యాచనే.ఏదయినా పని చెయ్యడానికి దొరికితే ఏదో కొంత ఆధారం ఏర్పడుతుంది. అనుకుంటూ లలితమ్మగారింట్లో అడుగు పెట్టింది. వాళ్ళిల్లు బంధువులతో హడావిడిగా వుంది. లలితమ్మ కంగారుగా అటూ యిటూ తిరుగుతోంది.

“ఏమయింది లలితమ్మా దేనికి కంగారు పడుతున్నావు?”
“ఏం చెప్పమంటారు పిన్నిగారూ, యీ రోజు మా శ్యామలకి సీమంతం వుదయాన్నే వియ్యాలవారు ఆరుగురు దిగారు.వంట మనిషికి యీ రోజు వుదయాన్నే రమ్మని చెప్పాను యీ రోజు వంటతో పాటు సాయంత్రం పేరంటానికి లడ్డూలు చేస్తానని నిన్న చెప్పింది.యీ రోజు వుదయాన్నే కబురు చేసింది మైల వార్త తెలిసింది రాలేనని. యిప్పటికిప్పుడు యీ పల్లెటూర్లో వంట కెవరు దొరుకుతారు?వియ్యాలవారిచేత చేయిస్తానా ఓపలేని పిల్లచేత చేయిస్తానా ఒక్క దాన్ని ఎలాగా అని కంగారు పడుతున్నాను.”

“ఎందుకమ్మా కంగారు? లడ్డూల సామగ్రి తీసుకెళ్ళీ మా చెల్లికి యిస్తాను మధాహ్నం కల్లా చేసి వుంచమని చెపుతాను.నేను తిరిగి వచ్చి నీకు వంటలో సహాయం చేస్తాను.” ” హమ్మయ్య రక్షించారు పిన్నిగారూ అలాగే చేయండి.”అంటూ లడ్డూల సామగ్రి సర్ది యిచ్చింది. అలా వెళ్ళి యిలా తిరిగి వచ్చిన అక్కని చూసి యీ రోజేమయింది అన్నట్లు చూసింది చిట్టెమ్మ.

వుత్సాహంగా విషయమంతా వివరించింది కావమ్మ.”సరే నువ్వు లలితమ్మకి సాయం చెయ్యి యీ లోగా నేను లడ్డూలు తయారు చేస్తాను.”దేవుడా రక్షించావు అనుకుంటూ మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంది.ఆ రోజు కావమ్మ చేదోడు వాదోడుగా వుండి వంట పూర్తి చేసింది.సీమంతం కార్యక్రమం అయింది,పన్నెండయేసరికి వెళ్ళొస్తాను లలితమ్మా పనయింది.” “అయ్యో భోజనం చేసి వెళ్ళండి పిన్ని గారూ”అంది. “లేదమ్మా చెల్లి ఒక్కర్తీ అయిపోతుంది యింటికెళ్ళి తింటాను.” “ఒక్క నిముషం వుండండి,”అంటూ ఒక కేరేజీలో బూరెలు పులిహోర కూర పులుసు పచ్చడి యిచ్చింది.”మా యిద్దరికోసం యిన్నెందుకమ్మా?” “ఎంతోలేదు తీసుకెళ్ళండి పిన్నిగారూ” అంటూ పంపింది సంతోషంగా.”మూడింటికల్లా మనిషిని పంపుతే లడ్డూలు యిస్తాను”అంటూ బయలుదేరింది కావమ్మ.

ఆరోజు అక్కా చెల్లెళ్ళిద్దరు నిన్నటి బాధ మర్చిపోయి సంతోషంగా విందు భోజనం చేశారు,రాత్రి కోసం కొంత అట్టే పెట్టుకున్నారు.

మర్నాడు లలితమ్మకి కేరియరు యివ్వడానికి వెళ్తే లలితమ్మ సంతోషంగా “రండి పిన్నిగారూ నిన్న మీరు చేసిన సహాయం వల్ల మా యింటి శుభ కార్యం చక్కగా ఒద్దెక్కింది.మా వియ్యాలవారు మరో మూడు రోజులుంటారు.నిన్నటిలాగ మీరు కాస్త సహాయం చేయండి మీ కష్టం వుంచుకోను.”

దానిదేముంది లలితమ్మ్ ఒకరికొకరం తోడు పడకపోతే ఎలా?తప్పక చేస్తాను చెల్లికి ఆలశ్యమవుతుందని చెప్పి వస్తాను.” “మీరెందుకు వెళ్ళడం?నేను కబురు చేస్తాను మీరు కూరలు తరగడ మొదలు పెట్టండి.”

నాలుగు రోజులు చింతలేకుండా భోజనం జరిగిపోయింది. నూరు రూపాయలు చేతిలో పెట్టి “పిన్నిగారూ పిల్ల పురుడు పోసుకుని అత్తవారింటికి వెళ్ళేదాకా రోజూ రండి ఏదో ఒక పని వుంటుంది”అంది శాంతమ్మ.”అలాగేనమ్మా పిల్ల చల్లగా కానుపు అయి తల్లి బిడ్డతో అత్తవారింటికి వెళుతుంది.చింత పడకు నేను రోజూ వచ్చి నీకేం కావాలన్నా చేస్తాను.”

యీమె సహాయం గురించి విన్నవాళ్ళు ఎవరింట అవుసరం వున్నా పిలిచి సహాయం పొంది తగిన ప్రతిఫలం యిచ్చేవారు.యింటిలో చేసే అవకాశం లేకుంటే సామగ్రి యిచ్చి కావమ్మగారింట్లో చేసి తెమ్మనేవారు.

యివేకాక పెరట్లో బచ్చలి కూర తోటకూర టమాటాల మొక్కలు పెంచింది చిట్టెమ్మ. వచ్చిన ప్రతి రూపాయి జాగ్రత్త చేసి ఒక ప్రణాళికగా బ్రతకడం ప్రారంభించారు.ఆత్మ గౌరవంతో ఎన్నాళ్ళు బ్రతకగలిగితే అదే చాలనుకున్నారు ఆ సోదరీమణులు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s