తప్పొప్పులు బాంధవ్యాలు

జీవితంలో ఆటుపోటులుంటాయి  గాని తన జీవితాన్ని తరిచి చూసుకుంటే అర్ధం  మారిపోతుందనిపిస్తుంది.  కొడుకు సుధీర్ జైలునుంచి మర్నాడు విడుదలవుతాడన్న కబురు తెలియగానే పాత జ్ఞాపకాలలోకి అసంకల్పితంగా వెళ్ళాడు సుబ్బారావు.

 సుధీర్  జైలుకెళ్ళాడన్నది స్నేహితులకి బంధువులకి అందరికీ తెలుసు,ముఖం ముందు ఏమీ అనరు వెనుదిరగగానే వాడి గురించే మాట్లాడుకుంటారు.లోకరీతి ఏం చెయ్యగలం? మొదట్లో ఆత్మహత్యా సదృశంగా వుండేది.భార్యని ఓదార్చడానికి,  తన ధైర్యం కూడదీసుకుని రోజులు వెళ్ళదియ్యడానికి అలవాటు పడ్డాను.బిడ్డల్ని కనగలం గాని వాళ్ళ అదృష్టాలని కనలేం.

సుధీర్ తొమ్మిదో క్లాసు వరకు బాగానే చదువుకునేవాడు.పధ్నాలుగో ఏట సుడి చుట్టుకుంది.చెడు స్నేహాలు చేసి ఎప్పుడూ జేబు ఖర్చుల కోసం వాళ్ళమ్మని పీడించేవాడు.నా దృష్టిలో పడకుండా ఆర్నెలలు గడుపుకొచ్చింది అనసూయ.ఆ పైన ఆమె వల్లకాలేదు. తనకి తెలియగానే చెడామడా తిట్టి మళ్ళీ యిటువంటివి సంభవిస్తే యింట్లోంచి బయిటికి నెట్టేస్తానని గట్టిగా మందలించాను.

తరువాత  యింట్లో చిన్న చితక వస్తువులు మాయమవడం గమనించి,మరోసారి గట్టిగా మందలించాను.అంతే!చెయ్యిదాటిపోయాడు. స్నేహితులతో కలిసి రాత్రివేళ వంటరిగా వచ్చేవారిని బెదిరించి పర్సులు వుంగరాలు వాచీలు సంగ్రహించి వాటిని అమ్ముకుని అవసరాలు తీర్చుకునేవాడు. నెత్తీ నోరూ బాదుకుని ప్రయోజనం లేకపోయింది.

ఒక రోజు పోలీసులు వచ్చి “మీ అబ్బాయిని అరెస్టు చేశాం స్టేషనుకి రండి” అనగానే కరచరణాలు ఆడలేదు.యిటువంటివి జీవితంలో వినలేదు కనలేదు.అనసూయకి చెప్పకుండా స్టేషనుకి బయలుదేరాను.అప్పుడు కూడా సుధీర్ ఏమీ జరగనంత నిబ్బరంగా వున్నాడు.

పోలీసుల వివరాలని బట్టి నలుగురు స్నేహితులు ఒక వ్యక్తిని అడ్డుకుని అతని వస్తువులు తీసుకోబోతుంటే తిరస్కరించాడుట. అందులో ఒకడికి కోపం వచ్చి “ఒక్కటిచ్చుకోరా ఏమిటి వీడి పొగరు” అనగానే ఎక్కడలేని ఆవేశం వచ్చి చేతిలోని హాకీ స్టిక్కుతో అతని తల మీద కొట్టాడుట.అదే సమయంలో చెట్టు చాటునుంచి ఒక వ్యక్తి మొబైల్ ఫోనుతో మొత్తం వీడియో షూట్ చేశాడుట.ఆ వ్యక్తి కింద పడగానే వీళ్ళంతా ఎగబడి అతని వస్తువలన్నీ ఒల్చుకు పోయారుట.

వీడియో తీసిన వ్యక్తి వెంటనే పోలీసులకి ఫోను చెసి జరిగినదంతా వీడియోలో చూపాడుట.అన్నిటికన్నా ఘోరం దెబ్బ తిన్న వ్యక్తి పోలీసులు వచ్చేసరికి చనిపోయాడు.నేరం అందరిదీ అయినా కొడుతున్నట్ట్లున్న ఫొటో సాక్ష్యాధారాలు సుధీర్ నేరాన్ని బలపరిచాయి. ముగ్గురికి మూడేళ్ళ జైలు శిక్ష సుధీర్ కి పధ్నాలుగేళ్ళ జైలు శిక్ష పడింది.నాకు నడుం విరిగినట్టయింది.కారణమేదయినా తప్పు జరిగిపోయింది శిక్షపడింది.సామాన్య కుటుంబీకుడికి యిది గొడ్డలి పెట్టే.

చివరగా సుధీర్ ని కలుసుకుందికి వెళ్ళినప్పుడు అనసూయ “నువ్వు నా కడుపున పుట్టలేదనుకుంటాను.పుట్టినా పురిటిలో పోయావనుకుంటాను.నువ్వు మా యింటిలో పెరిగిన రోజులన్నీ పీడ కలగా మర్చిపోతాను.నీలాటి కొడుకుకి తల్లినని చెప్పుకునేకన్నా గొడ్రాలినని చెప్పుకోవడానికి ఏమీ బాధ పడను”అంది.కళ్ళనీళ్ళతో.

అనసూయ భుజం చుట్టూ చేయి వేసి బయటికి తీసుకు వచ్చాను.ఆ తరువాత చూడటానికి వెళ్ళలేదు.ఇప్పుడీ వార్త గాయాన్ని కెలికి బాధని తాజా చేసింది.

సుధీర్ జైలుకెళ్ళిన ఆరు నెలలకేమో,విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్తున్నాను.నేను కూర్చున్న చోటుకి కాస్త దూరంలో ఏదో గొడవ వినిపించి లేచి వెళ్ళి చూశాను.ఎనిమిదేళ్ళ పిల్లాడు మురికోడుతున్న బట్టలు తైల సంస్కారం లేని జుత్తు,బెక్కుతూ ఏడుస్తున్నాడు.వాడి లేత బుగ్గ మీద నాలుగు వేళ్ళ అచ్చులు పడి  ఎర్రగా కందిపోయింది. ఏమయిందని అడిగాను. ఒకాయన రొప్పుతూ “డర్టీ రోగ్ అడుక్కుందికి వచ్చి కాలి మీద కొట్టి మరీ అడుక్కుంటున్నాడు.ఒళ్ళు మండి ఒక్కటిచ్చుకున్నాను.అసలిటువంటివాళ్ళని పబ్లిక్ ప్లేసుల్లో ఎందుకడుక్కోనిస్తారో అర్ధం కాదు.”యిసుమంతైనా జంకు లేకుందా అన్నాడు.పబ్లిగ్గా అడుక్కోకపోతే ప్రైవేటుగా వీళ్ళనెవరు పోషిస్తారు? నవ్వొచ్చినా ఆ పిల్లాడిమీద జాలి వేసి వాడి చెయ్యి పట్టుకుని నా సీటు వద్దకి తెచ్చాను.అందరూ నా చర్యని వింతగా చూస్తున్నారు.నేనేం చేస్తానో తెలియక బిక్క మొహం పెట్టాడా పసివాడు.

నీళ్ళ బాటిలు యిచ్చి తాగమన్నాను.పక్కన కూర్చోపెట్టుకుని,”నీ పేరేమిటి?” అడిగాను.

“భిక్కూ”

అదేం పేరురా?”

“ఎమో!” “అమ్మా నాన్న వున్నారా?”

“లేరు నన్ను పెంచిన అమ్మని మూడు రోజుల కిందట యీ రైల్లో కొట్టి దింపీసేరు.నేను పెట్టి కొసలో వున్నాను.నాకు తెలియదు.మా సిన్ని గాడు సెపితే తెలిసింది.

“మరిప్పుడేం చేస్తున్నావు?”

మావోల్లతో రైలెక్కి ఆల్లతోటే వుంతన్నా.”

ఎనిమిదేళ్ళ పిల్లడు పొట్టకూటి కోసం పెంచిన తల్లేమయిందోనన్న ఆతృత, ఆరాటం లేకుండా రొటీనులో  పడ్డాడంటే వాళ్ళకి రోజు గడవడంకన్నా వేరే బంధవ్యాలు వుండవు.”నాతో వస్తావా? చదివిస్తాను.యిలా అడుక్కోనక్కరలేదు.అందరిచేతా తిట్ట్లు దెబ్బలు వుండవు. రోజూ అన్నానికి  వెతుకులాడే  పని వుండదు. నాతో వస్తావా?”ఏమనుకున్నాడో దీర్ఘంగా నా ముఖంలోకి చూశాడు. నేను వాడి కళ్ళలోకి చూశాను ఒకరి నిజాయితీ ఒకరికి అర్ధమైనట్ట్లుంది.

“”అల్లాగే వత్తాను”  అన్నాడు.

చాయ్ వాడు వస్తే కొని వాడికిచ్చి బేగులోంచి నాలుగు బిస్కట్లు తీసి యిచ్చాను.టి వాడూ  ఆశ్చర్యంగా చూసి “ఏందిరో సిరి పిట్టినట్టుంది?”వెక్కిరింపుగా అన్నాడు.రోజూ పరిచయం వాళ్ళది.

రైలు గమ్యం చేరే లోగా ఒక్ ప్రణాళిక తయారు చేసుకున్నాను.అది ఎంతవరకు సఫలమౌతుందో నాకూ సందేహమే. నేనున్న పరిస్తితిలో గాలికి అల్లాడుతున్న ఒక్క జీవితాన్ని సరిదిద్ద గలిగినా కొంత మెరుగనిపించింది.

హైదరాబాదులో రైలు దిగి స్టేషను బయటికి వచ్చి పేవుమెంటు మీద రెండు జతల బట్టలు పిల్లడికి సరిపోయినవి  కొన్నాను.మళ్ళీ స్టేషనుకెళ్ళీ ప్లాట్ ఫారం టికెట్టు కొని ప్లాట్ ఫారం చివర కొళాయివద్ద వాడికి సబ్బిచ్చి స్నానం చెయ్యమన్నాను.వాడి రూపం కాస్త మెరుగయింది.తువ్వాలుతో తల తుడిచి తలదువ్వాను.బాగున్నాడు.వాడి కళ్ళలో చక్కని మెరుపుంది.

“ఈ రోజునుంచి నీ పేరు గోవిందు అని ఎవరడిగినా చెప్పు.నీగురించి ఎవరేమడిగినా నువ్వేమీ చెప్పకు, నేను చెప్పినదానికి కాదనకు. అంతకన్నా కావలసినదేమీ లేదు.”

ఏదేమయినా వీడిని ప్రయోజకుడిని చెయ్యాలని చాల దృఢనిర్ణయం చేసుకున్నాను.ఆటోలో యిల్లు చేరే లోగా వీడి గురించి అనసూయకి ఏం చెప్పాలో ముందే తయారు చేసుకున్నాను.

తలుపు తీసిన అన్సూయ నా వెనుకనున్న పిల్లాడిని  ఎవరన్నట్లు చూసింది. లోపలికెళ్ళాక చెప్పాను. “వీడు నా స్నేహితుడు శేషగిరి కొడుకు.విజయవాడలో వాడిని చూద్దామని వెళ్ళాని.అక్కడికెళ్ళాక తెలిసినదేమంటే, పదిహేను రోజుల క్రిందట వీడు వీళ్ళమ్మ నాన్న వెళ్తున్న ఆటో బోల్తా పడి వీళ్ళమ్మ అక్కడికక్కడే పోయిందట వీళ నాన్న మర్నాడు హాస్పిటలులో పోయాడుట.వీడిని యిరుగుపొరుగు వాళ్ళు చూస్తున్నారు. నేను వెళ్ళాక శేషగిరిగురించి భోగట్టా చేస్తుంటే పొరుగువాళ్ళు ఈ సమాచారం యిచ్చి వీడిని నాకిచ్చారు.అద్దె యిల్లు సామాన్లు ఎక్కువ లేవు.అన్నీ సెటిల్ చేసి వీడిని నాతో తెచ్చాను వీడి పేరు గోవిందు.”

అదేమిటండీ?మన పెంపకం ఎంత దివ్యంగా వెలిగిందో సుధీర్ తో తేలిసింది కదా,యింకా యీ అబ్బాయిని పెంచి ఏం లాభం?మరో మనస్తాపం భరించే ఓపిక లేదండీ.”

“వూరుకో అనసూయా మనిషి ఎప్పుడూ ఆశతోనే బ్రతకాలి.చూద్దాం మంచి పనికి దైవ సహాయం ఎప్పుడూ వుంటుంది.దిక్కు లేని పిల్లాడికి దారి చూపడం తప్పు,పాపం కాదు మరేమీ మాట్లాడకు.

ఆ రోజునుంచి గోవిందుని తీర్చి దిద్దటం ఒక యజ్ఞంలా భావించాను.మాటతీరు  చదువు నడవడిక ఒక ఒరవడిలో పెట్టడానికి చాల శ్రమ పడ్డాను.సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ నన్ను ఆశా పథం వేపు నడిచేలా చేశాడు గోవిందు.ప్రతి క్లాసు మంచి మార్కులతో పాసవుతూ,పదవ తరగతి మెరిట్ లో పాసయాడు. తెలిసిన వాళ్ళు గోవిందు ప్రగతి చూసి పొగడకుండా వుండలేకపోయారు.యింటరు కూడా మంచి మార్కులతో పాసయాడు. డిగ్రీ ఏ సబ్జెక్టుతో చదువుతావని అడుగుతే “మీ యిష్టం బాబుగారూ మీరేది మంచిదని నిర్ణయిస్తే అదే చదువుతాను” అన్నాడు గోవిందు.

బి కాం లో చేర్పించాను.ఫైనలియరుకి వచ్చాడు,రెండు నెలల్లో ఫైనల్ పరీక్షలు యీ సమయంలో సుధీర్ విడుదలై వస్తున్నాడు.యింటికే వస్తాడా?ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చి వుంటుందా?అన్నీ సందేహాలే!

అనసూయని అడిగాను “ఏం చెయ్యమంటావు?సుధీర్ ని యింటికి తీసుకు రమ్మంటావా?ఏం చెయ్యాలో నిర్ణయం వాడికే వదిలి పెట్టమంటావా?”

“మీరు వెళ్ళకండి వాడికి మనమీద అభిమానం వుంటే వాడే వస్తాడు.ఆనాడే వాడిని కాదని వచ్చేశాం,యీ రోజు వాడి మీద కొత్తగా మమకారం పెట్టుకోలేదు.రెండు నెలల్లో గోవిందు చదువు పూర్తవుతుంది.వాడిని చూస్తుంటే ముచ్చట వేస్తుంది.తన వల్ల ఎవరికి ఏ యిబ్బంది కలుగుతుందో అన్నట్ట్లు ప్రవర్తిస్తాడు.కన్న కొడుకు మనస్తాపమే మిగిల్చాడు. చూద్దాం వాడేంచేస్తాడో తొందరపడకండి.”

తల్లికి పుత్రవాత్సల్యం ఒక పాలు ఎక్కువే అంటారు కాని కాఠిన్యం వహిస్తే తండ్రిని మించిపోతుందనిపించింది.

సుధీర్ విడుదలయినప్పటినుండి మూడు రోజులు ఎదురు చూసినా యింటికి రాలేదు.ఏమయితే అయిందని జైలుకెళ్ళి అధికారులతో మాట్లాడాను.సుధీర్ ఒక సంవత్సరం కాస్త పొగరుగా వున్నా తరువాత తనలో మార్పు వచ్చిందని, తనకి చదువుకోవాలని వుందని కోరినట్ట్లు చెప్పారు.పుస్తకాలు తెప్పించి యిచ్చామని ఇందిరా గాంధి ఒపెన్ యూనివర్సిటీ ద్వారా బి ఎ,ఎమ్మె చేశాడని విడుదలయే వరకు లైబ్రరీ నుంచి పుస్తకాలు తెప్పించుకుని చదివేవాడని చెప్పారు.ఎవరి జోలికి పోకుండా చక్కని ప్రవర్తనతో జైలు స్టాఫ్ మెప్పు పొందాడని చెప్పారు.వింటున్న నా కళ్ళు ధారాపాతంగా కారడం గమనించలేకపోయాను.

“యివన్నీ నాకెందుకు తెలియజేయలేదూ?”

“సుధీర్ మీకు చెప్పొద్దన్నాడు.విడుదలయాక ప్రయోజకుడై మీ ముందు నిలబడతానన్నాడు.దానికి తగినట్లు ఏదైనా వుపాధి కలిగించడానికి అధికారులు సహాయ పడతామన్నారు.”

“ఇప్పుడెక్కడున్నాడు?”

“పధ్నాలుగు సంవత్సరాలు ఓపిక పట్టారు,మరికొన్నాళ్ళు వేచి చూడండి.మీ అబ్బాయి సత్ప్రవర్తనతో మీ వద్దకి వస్తాడు.మాకు పూర్తి నమ్మకముంది.”

ఏం చెయ్యలేక యింటికి వచ్చాను. అనసూయకి వివరాలేమీ చెప్పలేదు.అక్కడ విన్న వాటికి ఏ కొద్ది పాటి భిన్నంగా జరిగినా తట్టుకోలేదు.పైగా గోవిందు పరీక్షలయేవరకు ఈ విషయం గోప్యంగా వుంచదల్చుకున్నాను.

ఆరు నెలల తరువాత సుధీర్ వచ్చి మాయిద్దరి కాళ్ళకు నమస్కరించితే నమ్మకం కుదరలేదు.అనసూయ బిగుసుకు పోయి నోట మాట రాలేదు.

“అమ్మా! నాన్నా! నన్ను క్షమించండి, మీకు యికపై ఎటువంటి మనస్తాపం కలుగకుండా మసలుకుంటాను.”

“జైలు నుంచి విడుదలయాక యిన్నాళ్ళు ఎక్కడున్నావ్?

నా శ్రేయోభిలాషి యింట్లో ఒక నెల రోజులున్నాను.యిప్పుడు ఒక మారుమూల పల్లెటూరిలో సింగిల్ టీచర్ స్కూల్లో టీచరుగా పని చేస్తున్నాను. మీరు జైలుకెళ్ళి నాగురించి భోగట్టా చేశాక నేను ఈ వూరు వచ్చి మీకు తెలియకుండా దూరన్నుంచి మీ అందరినీ చూశాను.అప్పుదే గోవిందు గురించి తెలిసింది.చాలా మంచి పని చేశారు నాన్నా,మీ స్నేహితుని కొడుకుని చేరదీసి అతని భవిష్యత్తు తీర్చిదిద్దారు.గోవిందు చాలా అదృష్టవంతుడు నేను పొందలేని మీ యిద్దరి ప్రేమాభిమానాలు పొందేడు. యింకా చదువుకుంటానంటే చదివించండి.” గోవిందు స్నేహితుడి కొడుకు కాదని రైల్లో అడుక్కుంటున్న వాడిని తెచ్చానన్న నిజం నాలోనే నిక్షిప్తం చేసుకున్నాను.

సుధీర్ లో వచ్చిన మార్పు చూసి అనసూయ అబ్బుర పడింది,”ఈ ప్రవర్తన ఆదిలోనే వుంటే ఈ కష్టాలే వుండకపోవును కదరా? ఎంత కఠినంగా మాట్లాడి వచ్చేశాను.”అంది కళ్ళు తుడుచుకుంటూ.

నువ్వలా అని వచ్చేశాకే నాలో మథనం మొదలయింది.అదే సమయంలో నా వయసువాడే కొత్తగా జైలుకి వచ్చాడు.మా మధ్య స్నేహం ఏర్పడింది.మాటల మధ్య చెప్పాడు,అతనికి ఒక అక్క యిద్దరు తమ్ముళ్ళు వున్నారుట తండ్రి వుద్యోగం తప్ప వేరే ఆధారం లేదని. అటువంటి సమయంలో ఒక తుంటరి వాళ్ళ అక్కతో అసభ్యంగా ప్రవర్తిస్తూంటే వాళ్ళ నాన్న అడ్డుకుని చేతికందిన వస్తువుతో తలమీద కొట్టాడుట.

అతని చర్యని ఆపడానికే చేసినా దెబ్బతిన్న వ్యక్తి మరణించాడుట.అదే సమయంలో ఆ అబ్బాయి చూసి తండ్రిని ఆ ప్రదేశం నుంచి తప్పించి,కొట్టిన వస్తువుని తనచేతిలోకి తీసుకుని హతుని రక్తం తనకి అంటేలా చూసుకుని పోలీసులకి లొంగిపోయాడుట.

అలా ఎందుకు చేశావని అడిగితే ,ఆ పరిస్తితిలో తన తండ్రి జైలుకెళితే యింటిల్లిపాదీ నిరాధారమై రోద్దున పడతారని తన ఒక్కడికి శిక్ష పడినా మిగతా కుటుంబం బాగుపడుతుందని చెప్పాడు.

తండ్రి కోసం కుటుంబం కోసం నిరపరాధి శిక్ష అనుభవిస్తుంటే, నా సరదాలకోసం కుటుంబాన్ని బాధపెట్టి అవమానాలపాలు చేశాను .ఈ రెండింటినీ బేరీజు వేసుకుంటూ నాకు తెలియ కుండానే నాలో మార్పు వచ్చింది.యికపై నాగురించి చింత పడవద్దు.అంతా విన్న గోవిందు”బాబుగారి మంచితనం వూరికే పోదు అన్నాయ్యా!”అనగానే,యిన్ని సంవత్సరాలయినా యింకా బాబుగారేమిటి గోవిందూ నాన్నగారూ అని పిలువు.నిన్ను కొడుకులాగే పెంచుతున్నారు.”

ఆ మాట విన్నాక అనిపించింది చట్టబద్ధంగా గోవిందుని దత్తత చేసుకోవాలని.”సుధీర్ నువ్వుండగానేగోవిందుని దత్తత చేసుకుంటే మంచిదనుకుంటున్నాను,ఏమంటావు?”

మచిది నాన్నా అలాగే చేయండి.”

సుధీర్ ఎప్పటికీ యిలా ఒంటరిగా వుండిపోతావా?”జంకుతూనే అడిగింది అనసూయ.

“లేదమ్మా మమ్మల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఎన్ జి ఓలు జైలుకి వస్తుంటారు.అలా వచ్చే వారిలో సరళ అన్న అమ్మాయి వుంది.నా లోని పరివర్తన చూసి నేనంటే యిష్ట పడుతోంది.నాన్న, నువ్వు అంగీకరిస్తే ఆ అమ్మాయిని తీసుకు వస్తాను.”

తప్పకుండా తీసుకు రమ్మన్నాం సంతోషంగా.గోవిందుని దత్తత చేసుకున్న రోజున సుధీర్ సరళల నిశ్చితార్ధం కూడా జరిపించేశాం.వచ్చిన స్నేహితులు బంధువులతో చెప్పాను.ఒక కొడుకు వజ్రపు తునక కాస్త మసకబారినా మళ్ళా ప్రకాశించుతున్నాడు.మరోకొడుకు మట్టిలో మాణిక్యం,అంటూ యిద్దరినీ చెరో వైపు పట్టుకుని దగ్గరకు తీసుకున్నాను.బంధువులు స్నేహితులు హర్షధ్వానాలు చేశారు.

 

 

 
Advertisements

1 thought on “తప్పొప్పులు బాంధవ్యాలు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s