మరపు రాని సంఘటన

  మా నాన్నగారి వుద్యోగమంతా పల్లెటూర్లలోనే గదిచింది.బదిలీ అయినా ఒక పల్లె నుంచి మరో పల్లెకు వెళ్ళేవాళ్ళం,అలా నా చిన్నతనమంతా పల్లెటూర్లలోనే గడిచింది.ఒక పల్లెలో జరిగిన సంఘటన యిప్పటికీ నాకు అర్ధం కాక తికమకగానే వుంటుంది.

 

     నాకు పన్నెండు సంవత్సరాలు.మేమున్న ప్రాంతంలో ఏవో సంబరాలు జరుగుతూండేవి.ఏ సంబరమైనా డప్పుల మోత వినపడేది.అలా డప్పులమోత వినగానే వీధిలోకి పరుగెత్తి అరుగు మీద కూర్చునేదాన్ని.ఆ సందడంతా మా యింటి ముందునుంచి దాటాక యింట్లోకి వెళ్ళేదాన్ని.

 

     అలాగే ఒక రోజు డప్పుల మోత వినపడగానే వీధిలోకి పరుగెత్తాను.మా అమ్మ కేకవేస్తూ”వీధిలోకేమొచ్చినా పరుగెడతావు,నేను పనిలో వున్నాను వీధి తలుపు వేస్తాను, ఆ సందడయ్యాక తలుపు కొట్టు తీస్తాను అన్నయ్య పడుక్కున్నాడు” అంది.సరేనని వీధరుగు మీద కూర్చున్నాను.

 

     డప్పులమోత దగ్గరయింది.డప్పుల వాయిద్యగాళ్ళ వెనుక కొంతమది పిల్లలు పెద్దలు లయకి తగినట్లు నాట్యం చేస్తున్నారు.ఆ వెనుక ఒక స్త్రీ తడిబట్టలతో ఒంటినిండా పసుపు రాసుకుని నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో తల మీద పూలతో అలంకరించిన బిందె(అమ్మవారికి  ఘటంతో మొక్కు తీర్చుకోవడం) బిందెపైన వెలుగుతున్న దీపం,కళ్ళు తెరవకుండా చేతులతో బిందె పట్టుకోకుండా నడుస్తున్నాది. ఆమె నడిచినంతమేరా పసుపునీళ్ళలో ముంచిన చీరలు  తోవంతా పరుస్తూన్నారు.వాటిపైన ఆమె నడుస్తున్నాది.ఆమె రెండు వైపులా ఒకరు ధూపం వేస్తూంటే ఒకరు వేపమండలతో విసురుతున్నారు.వెనుక యిద్దరు ఘటం పొరపాటుగానైనా ఘటం కింద పడకుండా చేతులు ఆసరా చూపిస్తూ నడుస్తున్నారు.అక్కద వాళ్ళు గ్రామ దేవతకి మొక్కు తీర్చుకునే ఒక ఆచారం.

 

    అవన్నీ వింతగా చూస్తున్నాను.మా యింటిముందుకి వచ్చి ఘటం పట్టుకున్నామె ముందుకు అడుగు వెయ్యకుండా నిల్చుండిపోయింది.ధూపం మరికొంత వేసి వేపమండలతో విసురుతూ “అడుగెయ్యి తల్లీ! ఏం కావాలమ్మా?సెప్పు తల్లీ లోపముంటే దిద్దుకుంటామమ్మా!”తలో విధంగా ప్రాధేయ పడుతున్నారు. ఆ స్త్రీ అంగుళం కూడా కదల్లేదు సరికదా ‘వూ వూ—అంటు వూగిపోతోంది.చుట్టూ వున్న వాళ్ళు ఒకరి తరువాత ఒకరు ఆమె కాళ్ళకి దండాలు పెడుతున్నారు.

 

    “ఈ యింటి వాళ్ళని బయటికి పిలవండి.నాలుగు రోజుల కిందట నాకు నైవేద్యాలు పెట్టి గుమ్మం ముందునుంచి వెళ్తూంటే తలుపులేసుకుంటుందా?పిలవండి”వూగిపోతూనే చెప్పింది.

 

    నాకు కాళ్ళలోంచి ఒణుకు వచ్చింది.ఒక పెద్దతను వచ్చి అమ్మా అమ్మగారిని పిలువమ్మా నేకుంటే ఘటం కదల్దు.”అనగానే తలుపు దబ దబా బదేను.అమ్మ విసుగ్గా  తలుపు తీసి ఏమాట అనేలోపున పెద్దతను వచ్చి “అమ్మగారూ ఒక  పాలి అమ్మోరి ఘటం ఎత్తుకున్న మడిసితో మాటాడండమ్మా.”

 

       అమ్మ ఆశ్చర్యంగా వెళ్ళి ఏం కావాలి తల్లీ? మావల్ల ఏం అపరాధం జరిగింది?” అమ్మకి యిటువంటివి పరిచయం వున్నట్ట్లుంది.

 

    ఘటం ఎత్తుకున్నామె “అపరాధమంటావేం? నీకొడుకు ఒంటి మీద వచ్చి పదిహేను రోజులు నీ యింట వున్నాను. నాలుగు రోజుల కిందట నాకు నైవేద్యాలు పెట్టి, నీ గుమ్మం ముందునుంచి వెళ్తుంటే వసంతం నీళ్ళతో కాళ్ళు కడిగి పిల్లడిచేత దండం పెట్టించడం ఫోయి తలుపులేసుకుంటావా హూం?” హుంకరించింది.

 

    అమ్మ వెంటనే కాళ్ళకి దండం పెట్టి “క్షమించు తల్లీ తప్పైపోయింది క్షణంలో వస్తాను”అంటు లోపలికెళ్ళి పెద్ద చెంబుతో వసంతం ఒక గ్లాసు పానకం పసుపు కుంకుమలతో పాటు అన్నయ్యను కూడా తీసుకొచ్చింది. అన్నయ్యచేత వసంతం నీళ్ళతో ఆమె కాళ్ళు కడిగించి దండం పెట్టించింది.పానకం గ్లాసు అందించి అమ్మ నమస్కారం చేసి నాచేత నమస్కారం చేయించింది పసుపు కుంకుమలు సమర్పించి లెంపలు వేసుకుంది.ఘటం పట్టుకున్నామె మా ముగ్గురి తలల మీద ఒకరి తరువాత ఒకరికి చేయివేసి “చల్లగా వుండండి”అంటూ ఆశీర్వదించింది.

 

   యిప్పటికీ ఆ సంఘటన తల్చుకుంటే ఆశ్చర్యంగా వుంటుంది. నిత్యం యాసతో మాట్లాడే ఆమె ఆసమయంలో అంత స్వచ్చంగా ఎలా మాట్లాడింది? మా యింట్లో మా అన్నయ్యకి ఆటలమ్మ వచ్చిన తగ్గినట్ట్లు ఆమెకెలా తెలిసింది?యివన్నీ సందేహాలే.పెళ్ళయ్యాక పల్లెలు వదిలి పట్నానికి వచ్చినా అనాటి సంఘటన యిప్పటికీ ప్రశ్నార్ధకమే!

2 thoughts on “మరపు రాని సంఘటన

  1. కొన్ని కొన్ని సంఘటనలకి కారణాలు దొరకవు,అదే ఆది దైవికం, ఆది భౌతికమంటే,ఇప్పటివారు నమ్మరనుకోండి, బాగుంది.

Leave a comment