కిరణోదయం

గిరిజకి అమ్మ వద్దనుండి ఫోను వచ్చింది.”హలో! గిరిజా సంక్రాంతి పండక్కి నువ్వూ గాయత్రి వస్తే బాగుంటుంది.తనకి కూడా చెప్తాను. మూడేళ్ళయింది మీరంతా వచ్చి అన్నయ్యకి రావటానికి వీలు పడదన్నాడు.మీరిద్దరూ రావడానికి ప్రయంతించండి. అల్లుడు కూడా శలవు పెట్టి వస్తే మాకు సంతోషం.అరుణ్ ఎలా వున్నాడు?”అమ్మ కామా పుల్ స్తాపు లేకుండా చెప్పేసింది .
“సరే రావటానికి ప్రయత్నిస్తాను.నాన్నా నువ్వూ బాగున్నారుకదా?”
గాయత్రి వీలు కాదంది , మా వారు శలవు లేదన్నారు. నేనయినా అరుణ్ ని తీసుకుని వెళ్తే అమ్మా నాన్నా సంతోషిస్తారని పండగ నాలుగు రోజులుందనగా బయలు దేరాను. మా వూరు చేరగానే అమ్మని అడిగిన మొదటి ప్రశ్న జానకి ఎలా వుందని.
“ఏమోనే నాకూ వెళ్ళటానికి వీలుంపడటం లేదు.వెంకటాద్రి మామయ్య పోయాక నాన్న వెళ్ళటం తగ్గించేశారు. నేను ఏ పూజకో పేరంటానికో బయటకు వెళ్తే ఒక సారి వాళ్ళింటికి వెళ్తుంటాను.”

మర్నాడు జానకి యింటికి వెళ్ళాను.జానకి పెద్ద కొడుకు తలుపు తీశాడు.”అమ్మేదిరా?’అనగానే అమ్మమ్మా! గిరిజత్తయ్య వచ్చింది చూడు.”అని లోపలికి వెళిపోయాడు.కమలత్తయ్య వచ్చి “ఎప్పుడొచ్చావు గిరిజా?”అంది ?నిన్ననే అత్తయ్యా జానకేదీ?” “యింట్లో లేదమ్మా పని మీద వెళ్ళింది.రావడానికి టైము పట్టవచ్చు. యింట్లోకి రమ్మన లేదు కూర్చోమనలేదు. ఏమయింది అత్తయ్య యిలా ప్రవర్తిస్తున్నాది.అనుకుంటూ “సరే నేను వచ్చానని జానకికి చెప్పు తరువాత వస్తాను” అని వచ్చేశాను.

ఇంటికి వచ్చి విషయం అమ్మకి చెప్పి “ఆశ్చర్యంగా వుంది ,జానకి యింట్లో లేకపోతే కనీసం నన్ను యింట్లోకి రమ్మన లేదు. మన రెండిళ్ళమధ్య వున్న యింత స్నేహం ఏమయిందమ్మా?”అంటూ వాపోయాను.”పోనీలే మామయ్య పోయినప్పటినుండి అత్తయ్య చాల ఒంటరి అయిపోయింది. అందుకే అలా ప్రవర్తించి వుండవచ్చు.తాపీగా కనుక్కుందాంలే”

జానకి గిరిజ స్నేహితులు క్లాసుమేట్లు, యింతే కాక గిరిజ తండ్రి జానికి తండ్రి క్లాసుమేట్లు.ఏనాటి స్నేహమో ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించుకోవడమే తప్ప ముఖం తిప్పుకోవడాలు ఎప్పుడు జరగలేదు.

ఈ సంఘటన పక్కన పెట్టి పండుగ పనుల్లో సహాయం చేయసాగింది గిరిజ.పండుగ నాడు “పసుపు కుంకుమ పళ్ళు యిచ్చి వద్దాం వస్తావా?”అని తల్లి అడిగితే “యింటికి వచ్చే ముత్తయిదువులకు నేను తాంబూలం యిస్తాను.నువ్వెళ్ళి రామ్మా”అన్నాను.

రెండో వీధిలో వుండే జానకి యింటికే బయలు దేరింది సరస్వతి.తలుపు తట్టగానే కమలమ్మ తలుపు తీసింది,”రా వదినా బాగున్నావా?గిరిజ రాలేదా?””లేదు పిల్లడు ఒక్కడే యింట్లో వుండాలి అందుకే రాలేదు.అన్నట్లు జానకి ఏదీ బొట్టు పెట్టి తాంబూలం యిస్తాను.”

చేయి పట్టుకుని మూల గదిలోకి తీసుకెళ్ళి “ఏం చెప్పమంటావు వదినా, అల్లుడి ప్రవర్తన ఉప్పూ నిప్పూలా వుంది.జానకిని చూస్తే మండి పడుతున్నాడు.ఆరోజు జానకి వచ్చినప్పటికి మూడు రోజులనుంచి ఘర్షణ నడుస్తోంది. పిల్ల తిండి నిద్ర మరిచి కంటికీ మింటికీ ఏడుస్తోంది.పెద్దరికం వున్నా ఆడదాన్ని ఏమీ మాట్లాడలేకపోతున్నాను. మీ అన్నయ్య వుంటే ఏం పరిష్కారం చేసే వారో.ఒక్కగానొక్క పిల్ల అని రాఘవని యిల్లరికం తెచ్చుకున్నాం.ఏడాదికొకరు చొప్పున ముగ్గురు కొడుకులు పుట్టారు.అంతా బాగుందనుకుంటున్న సమయంలో శని దాపురించింది. రెండు నెలలై ఎవ్వరికీ మనశ్శాంతి లేదు.

“కారణం ఏమిటి వదినా? నాకు చెప్పు మీ అన్నయ్య రాఘవని మందలిస్తారు.”
“అబ్బో రాఘవ యిప్పుడు చాలా ఎత్తుకెదిగిపోయాడు వదినా ఎవరి మాటలు వినే స్థితిలో లేడు తను చెప్పిందే వేదం.యింక మా యింట పండుగ పున్నం లేదులా వుంది.”

శాంతంగా కూర్చోబెట్టి అసలు విషయం తెలుసుకుంది సరస్వతి.జానకికి మూడో అబ్బాయి పుట్టగానే రాఘవ వేసక్టమీ ఆపరేషను చేయించుకున్నాడు.అదో పెద్ద వార్తలా పల్లెటూర్లో బాగానే ప్రచారమైంది. చిన్నవాడు ఎనిమిదేళ్ళ వాడయాక జానకి గర్భవతైంది.రెండు నెలలయేదాకా ఏమీ అనుకోలేదు.తరువాత నర్సు పరీక్షించి నిర్ధారణగా తెలిపింది.అప్పటినుంచి యింట్లో తుఫాను మొదలైంది.తను ఆపరేషను చేయించుకున్నాక జానకి గర్భవతెలా అయిందని రోజూ గొడవ.ముగ్గురు బిడ్డల తల్లిని అనుమానించటం పాపం అని ఏడ్చినా జాలి కలగలేదు.

రోజూ ఏదో ఒక సందర్భంలో మాటల యీటెలతో జానకిని బాధ పెట్టడం,ఎవరితోనూ మాటా పలుకూ లేకుండా బయట తిరిగి రావటం చేస్తున్నాడు రాఘవ. జానకి వేసే ఒట్లు సత్యాలు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి.

విషయాలన్నీవిన్నాక  సరస్వతి అడిగింది”జానకి ఏదీ?
“ఈ రెండు నెలలై స్టొర్ రూములో వుండటం పడుక్కోవడం చేస్తున్నాది.వంట పని చూసి లోపలికెళిపోతోంది.నేనే అల్లుడికి పిల్లలకి అన్నం పెడుతున్నాను పిల్లలు యీ పరిస్థితి చూసి బెంగ పడిపోతున్నారు.నాకు దారీ తెన్నూ కనిపించటం లేదు.ఈ వార్త బయటికి పొక్కితే దావానలంలా వ్యాపించి మా కుటుంబాన్ని రాబందుల్లా పీక్కు తింటారు.అందరం కట్టగట్టుకు ఏ గంగలోనో దూకడం మినహా గత్యంతరం లేదు వదినా.” అంటూ భర్త పోయిన నాటి కన్న ఎక్కువ దుఖంతో చెప్పింది కమలమ్మ.

తిన్నగా స్టొరులోకెళ్ళింది సరస్వతి. అశోకవనంలో సీతలాగే అనిపించింది జానకి. ముగ్గురు బిడ్డల తల్లయినా పచ్చగా పసిడి బొమ్మలా వుండే జానకి నలుపు రంగుకి మారి కళ్ళ చుట్టూ మసి పూసినట్ట్లయి జీవం లేనట్ట్లుంది. “జానకీ” అనగానే సరస్వతిని అల్లుకుపోయి “అత్తయ్యా! నా ముఖం అందరికీ ఎలా చూపించను? నేను నిర్దోషినని ఎలా నిరూపించుకో గలను? గిరిజ వచ్చిందని తెలిసినా బయటకు వచ్చి స్నేహితురాలిని పలుకరించలేని అశక్తత.ఏం చూసుకుని బ్రతకాలి?”బావురుమంది.

” వూరుకో జానకీ ఏడవకు.నీ కొడుకుల్ని చూసుకుని బ్రతకాలి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకోసం బ్రతకాలి.నేను చెప్పేది జాగ్రత్తగా విను.యిలా అధైర్యంగా బేలగా ఏడుస్తుంటే నీ భర్త ఎప్పటికీ నువ్వు నిర్దోషివనుకోడు.నువ్వు అమాయకురాలివి, నువ్వు ఏ తప్పు చేయలేదు ఊరందరూ ఆమాట ఒప్పుకోగలరు అందులో ఏమీ సందేహం లేదు. నీ భర్తకి ఒక్కటే చెప్పు పట్నం వెళ్ళి పెద్ద హాస్పిటల్ లో యీ పరిస్థితి వివరించితే ,తన ఆపరేషను విఫలమయిందా లేదా అన్నది వాళ్ళు పరీక్షించి చెపుతారు. బిడ్డ పుట్టిన తరువాత ఒక పరీక్ష వుంటుంది.అది తండ్రీ బిడ్డలిద్దరికీ చేస్తారు.అదికూడా చేయించుకోమను.వీటి ఫలితాలని బట్టి నీకు ఏ శిక్ష వేసినా భరిస్తాననిచెప్పు.కనీసం తన పరీక్ష అయేదాకా శాంతంగా వుండమను.ఏమీ భయపడకుండా నిలిచి పోరాడు,నీవెనుక మేమంతా వున్నాం.అంటూ బొట్టు పెట్టి తాంబూలం యిచ్చి కమలమ్మకి కూడా ధైర్యం చెప్పి, మరింకే యింటికి వెళ్ళే మనసు లేక యిల్లు చేరింది సరస్వతి.

తల్లి చెప్పిన విషయం విని గిరిజ నిర్ఘాంతపోయింది.ఎంత అన్యోన్య దాంపత్యామైనా నమ్మకం తగ్గగానే బ్రతుకు నరకం అయిపోతుందన్నదానికి జానకి నిదర్శనం. మూడొ నాడే తన ప్రయాణం వెళ్ళి కలుసుకోవాలా వద్దా అని మీమాంస పడింది. అమ్మ చెప్పినట్లు అమలు చేస్తే పరిస్థితి చక్కబడుతుంది.తను వెళ్ళి బాధని కెలకడం ఎందుకని ఊరు ప్రయాణమైంది.

మరుచటి వారం అమ్మ ఫోను చేసింది రాఘవ పట్నం వెళ్ళి పరీక్ష చేయించుకుంటే ఆపరేషను విఫలమైందని ,యిటువంటి సంఘటనలు వేలలో ఒకటి సంభవించవచ్చని భార్యని అనుమానించకుండా జాగ్రత్తగా చూసుకోమని పెద్ద దాక్టరు చెప్పారుట.అప్పటినుంచి రాఘవ కాస్త శాంత పడ్డాడుట. అమ్మయ్య! కొంత నిశ్చింత అనిపించింది.పాపం జానకి ఈ పరిస్థితి నెలా భరించిందో.నిజంగా భూదేవికున్నంత సహనం వుందనుకున్నాను.

తొమ్మిదినెలలు నిండగానే పట్నం తీసుకెళ్ళి హాస్పిటల్లో పురుడు పోసుకున్నాక డాక్టరు సలహా మీద జానకికి ఆపరేషను చేయించారు. ఆడపిల్ల పుట్టింది.మూడోనాడు డి ఎన్ ఎ పరీక్ష చేసి రాఘవే ఆ బిడ్డకి తండ్రి అని సర్టిఫికేట్ యిచ్చారు.అది చూశాక రాఘవ చాలా సిగ్గు పడ్డాడు,చదుకున్న తనే మూర్ఖుడిలా ప్రవర్తిస్తే యిక చదువులేని వాళ్ళ సంగతేమిటి అని జానకికి పదే పదే క్షమాపణ చెప్పాడు.

కారు మబ్బులు విడిచినట్లుందని తల్లితో అంది జానకి.”అమ్మా అసలు జానకి ఆరు నెలలు పరాయి యింట చెరలో వుంటే నా యింట్లోనే నేను ఏడు నెలలు చెరలో వున్నాను.నాచెర విడిచినా ఊర్లో యీ సర్టిఫికేటు చూపిస్తూ తిరగం కదా, యీ బిడ్డని గూర్చి ఏమని చెప్పాలి?”

అక్కడే వున్న రాఘవ”యీ విషయంలో నువ్వేమీ చింత పడకు.వూర్లోవాళ్ళకి చెప్పడం నావంతు.”నిశ్చింతగా వూపిరి తీసుకుంది జానకి.

“పిచ్చిదానా అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే వుంటారు.వాళ్ళకి కూడా తెలియాలి అప్పుడప్పుడు యిటువంటి విడ్డూరాలు కూడా జరుగుతుంటాయని.”తల్లి జానకిని ఓదార్చింది.

అనుకోకుండా గిరిజ పుట్టింటికి వచ్చింది.జానకిని అభినందించి,”నీ జాతకంలో ఆడపిల్ల రాసి పెట్టి వుంటుంది.ఎంత కాదనుకున్నా డాక్టర్లని సవాల్ చేస్తూ యీ పాప పుట్టింది.ఏం పేరు పెడతావ్?బాలసార ఘనంగా చెయ్యి.జరిగిందంతా పీడకలలా మర్చిపో.”అంటూ స్నేహితురాలిని వుత్సాహ పరిచింది గిరిజ.వీళ్ళ మాటలు విన్న రాఘవ “నాలాంటి మూర్ఖుడు మరొకడుండడు. యిన్నాళ్ళూ కలిసి బ్రతికి ఎంత హీనంగా ప్రవర్తించానో గుర్తుకొస్తే నా మీద నాకే అసహ్యమేస్తోంది. సరైన సమయంలో మీ అమ్మగారు సలహా యివ్వకుంటే యీ సంసారం ఛిన్నాభిన్నమైపోయి వుండును.”

బాలసారనాడు నామకరణం చేస్తూ”కిరణ్మయి”అని పేరు పెట్టాడు.కొంత విషయం ముందుగానే తెలిసినా వచ్చిన బంధువులకు స్నేహితులకు తన కధ వినిపించి, ఎప్పుడయినా యిటువంటివి సంభవించినప్పుడు మనో ధైర్యం వీడకుండా ప్రవర్తిస్తే చాలా బాగుంటుది. చంటి బిడ్డని ఎత్తుకుని ముద్దాడుతూ పై మాటలు చెప్పాడు. జానకిలోని బెరుకు పోయి వెన్నెలకురిసినట్లు మల్లెలు విరిసినట్లు నవ్వింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s